ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.తెలుగు లో ఎన్నో మంచి సినిమాలు చేశారు.సూపర్ హిట్ సినిమాలు "అమ్మోరు", "అరుంధతి" ఆయన తీసినవే.ఆయన స్వర్గీయ దాసరి నారాయణరావు గారి శిష్యుడు.దాసరి గారి లాగే ఎన్నో కుటుంబ కథా చిత్రాలు తీశారు.నిజంగా ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమకి తీరని లోటు.
సినీ రంగంలో కోడి రామకృష్ణది 30 ఏళ్ళ ప్రస్థానం. ఆయన తొలి చిత్రం చిరంజీవితో చేసిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ . ఈ మూవీ అప్పట్లో 500 రోజులకి పైగా ఆడింది. నటుడిగానూ ఆయన పలు చిత్రాల్లో నటించారు. ‘దొంగాట’, ‘ఆస్తి మూరెడు ఆశ బారెడు’, ‘అత్తగారూ స్వాగతం’, ‘ఇంటి దొంగ’, ‘మూడిళ్ల ముచ్చట’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. 1979లో కోరికలే గుర్రాలైతే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా కోడి రామకృష్ణ పనిచేశారు. తెలుగు సినిమా స్థాయి మరో మెట్టు ఎక్కించిన శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ గతంలో హార్ట్ అటాక్, పక్షవాతానికి గురయ్యారు. ఆ సమయంలో సరైన చికిత్స వలన వెంటనే కోలుకున్నారు. ఇప్పుడు కూడా త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వస్తారని అనుకున్న సమయంలో ఆయన ఇక లేరనే వార్త తెలుసుకున్న అభిమానుల కంట కన్నీరు ఆగడం లేదు. మరి కొద్ది క్షణాలలో కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం నగర్లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



0 comments:
Post a Comment